ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మేయర్, మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులతో పాటు 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,485 కేంద్రాల్లో నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు.
నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 19న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వరకు అవకాశం కల్పించారు. అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ అనంతరం ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల సందడి మొదలైంది.

