CM Chandrababu : రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఖనిజ వనరులను సమర్థంగా వినియోగించడం, అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల లభ్యత, విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలపై ఆయన అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
సీఎం మాట్లాడుతూ విశాఖపట్టణంలో పరిశ్రమలు వేగంగా వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రను మెటల్ ఆధారిత పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు విశాఖలో ఏర్పడుతున్న పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగపడేలా మైనింగ్ శాఖ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఏపీ ఎండీసీని ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. లీజులున్న గనులే కాకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే అక్రమ తవ్వకాలను ఆర్టీజీఎస్ వ్యవస్థ, డ్రోన్ సర్వేలు, శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించగలిగే విధంగా పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
ఒడిశా ఖనిజ ఆదాయాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉందని ప్రస్తావించిన సీఎం, అక్కడ అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, ఏపీలో కూడా అవి ప్రయోజనకరమైతే అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో లభ్యమయ్యే లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, గ్రానైట్ వంటి ఖనిజాలు ఏ ఏ పరిశ్రమలకు ముడి సరుకుగా ఉపయోగపడతాయో పూర్తి స్థాయిలో విశ్లేషించి, ఏ ఖనిజాలను నేరుగా ఎగుమతి చేయాలో, ఏ ఖనిజాలకు విలువ జోడించి రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలో స్పష్టమైన వ్యూహం రూపొందించాలని ఆదేశించారు.
HYDRA : మారుతున్న ఓల్డ్ సిటీ బమృక్నుద్దౌలా చెరువు రూపురేఖలు
బీచ్ శాండ్ ద్వారా టైటానియం ఉత్పత్తులు, మాంగనీస్ ద్వారా ఫెర్రో ఎల్లాయిస్, క్వార్ట్జ్–సిలికా శాండ్ ద్వారా సోలార్ ప్యానెల్లు, PV సెల్స్, గ్లాస్ ఉత్పత్తులు, గ్రానైట్ ద్వారా పాలిషింగ్–కటింగ్ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అవసరమైతే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో అధిక అవసరం ఉండే ఫ్యూచరిస్టిక్ మినరల్స్‌పై కూడా పరిశోధన చేసి, నిపుణుల సహాయంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ వంటి ముడి సరుకుల సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకూడదని ప్రత్యేకంగా సూచించిన సీఎం, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి అవసరమైన మెటీరియల్‌ను సింగిల్ విండో విధానంలో నేరుగా కలెక్టర్ల సమన్వయంతో సీఆర్డీఏకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరఫరాలో ఎవరైనా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇసుక సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకతతో నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, రాష్ట్ర సరిహద్దుల చెక్ పోస్టులు, సీసీ కెమెరా నెట్వర్క్ ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. మొత్తంగా, మైనింగ్ రంగంలో సమగ్ర సంస్కరణలు, విలువ ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం, పరిశ్రమలకు నిరంతర ముడి సరుకు లభ్యత లక్ష్యంగా సీఎం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ చూపనున్నాయి.
CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
