NTV Telugu Site icon

Nara Lokesh Saved AP Man: మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. కువైట్ నుంచి సొంత గ్రామానికి చేరుకున్న శివ

Kuwait Siva

Kuwait Siva

AP man trapped in Kuwait Reached Home: కువైట్‌లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఓ తెలుగు కార్మికుడు సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. ఎట్టకేలకు తన మాటను నెలబెట్టుకున్నారు. ఏపీ ప్రభుత్వం చొరవతో కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ కువైట్‌ నుంచి తన స్వగ్రామానికి చేరుకున్నారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్‌ చేసిన విషయం విదితమే. నెల రోజుల ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏజెంట్ సాయంతో కువైట్‌ వెళ్లిన శివను అక్కడ పని పేరుతో హింసకు గురి చేశారు. దీంతో తనను కాపాడాలని, లేకపోతే మరణమే శరణ్యం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎంబసీని సంప్రదించి శివను ఇండియాకు రప్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శివను ఇండియాకు రప్పించేలా ఏర్పాట్లు చేయడంతో సురక్షితంగా సొంత గ్రామానికి చేరుకున్నాడు. శివ సేఫ్‌గా ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్‌కు శివ, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు.

Read Also: Minister Kollu Ravindra: త్వరలోనే నూతన మద్యం పాలసీ..

కాగా, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. శివ సొంత ఊరు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు అయితే.. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం తన అత్తగారి ఊరు అయినటువంటి పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి ఇల్లరికం వచ్చాడు.. ఆ తర్వాత జీవనోపాధి కోసం గల్ఫ్ కంట్రీ కువైట్ కు వెళ్లాడు.. నెల క్రితం గొర్రె కాపరిగా చేరినట్టు తెలుస్తోంది.. అయితే అక్కడ అనేక ఇబ్బందులు పడి ఎడారిలో నీటి వసతి లేని చోట.. కరెంటు కూడా లేని చోట.. ఆ కువైట్ యజమాని పెట్టడంతో విధి లేని పరిస్థితిలో సోషల్ మీడియా ద్వారా.. వాట్సాప్ ద్వారా తన మనోవేదనను, బాధను వీడియో రూపంలో విడుదల చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది.. ఇక, కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్.. శివను స్వగ్రామానికి రప్పించే విషయంపై చర్చించారు.. మొత్తంగా శివను స్వరాష్ట్రానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగా శివను సొంత గ్రామానికి చేర్చారు.

ఇక, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నారా లోకేష్‌.. ప్రజాదర్భార్‌ నిర్వహిస్తూ.. స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.. తన సొంత నియోజకవర్గం మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎవరు తమ సమస్యలపై తన దగ్గరకు వచ్చినా.. సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నారు.. మరోవైపు.. సోషల్‌ మీడియా ద్వారా తనకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా మంత్రి నారా లోకేష్ దృష్టిసారించిన విషయం విదితమే.