ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సన్నాహకాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా అభివృద్ధి పనులు చేపడుతోందని, ఈ స్థానిక ఎన్నికల విజయంతో రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’ ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, రాబోయే 50 రోజులు నేతలందరూ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. నేతల పనిచేసే తీరు, నిజాయితీ, సమర్థతను బేరీజు వేస్తూ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, క్షేత్రస్థాయిలో నేతల పనితీరుకు ప్రత్యేకంగా రేటింగ్స్ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్థానిక పోరులో బీసీలకు పెద్దపీట వేస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ సిఫార్సులను ఆమోదించామని, చట్టపరంగా 34 శాతానికి పైగా స్థానాలు కేటాయించడంతో పాటు, పార్టీ పరంగా దాదాపు 40 శాతం సీట్లు బీసీలకే ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ‘జయహో బీసీ..! జనాభాలో సగం – కూటమి ఇచ్చింది బలం’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని కేడర్‌కు ఆదేశించారు.
ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన సూపర్ సిక్స్ హామీలు, రూ. 1.50 లక్షల కోట్ల సంక్షేమం, సమాన స్థాయి అభివృద్ధి, చెత్త పన్ను రద్దు, పల్లె పండుగ పనులు, గృహప్రవేశాలు, భూ వివాదాల పరిష్కారం, విశాఖ, విజయవాడల్లో ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య క్షేత్రస్థాయి వరకు పక్కా సమన్వయం ఉండాలని, వైఎస్సార్‌సీపీ చేసే ఫేక్ ప్రచారాలను, కుట్రలను తిప్పికొట్టి అభ్యర్థులందరినీ గెలిపించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

