ఆర్టీఐ చట్టం దుర్వినియోగానికి పాల్పడుతున్న పల్నాడు జిల్లా వెల్పూరుకు చెందిన యడ్ల భద్రయ్యపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తీవ్ర చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు వెయ్యికి పైగా ఆర్టీఐ దరఖాస్తులు, 300కు పైగా రెండో అప్పీళ్లు వేసిన ఆయనపై పునరావృత దరఖాస్తులు, అప్పీళ్లపై కమిషన్ పూర్తి నిషేధం విధించింది. ఇప్పటికే సమాచారం అందించిన అంశాలపై మళ్లీ దరఖాస్తులు చేయవద్దని స్పష్టం చేసింది. సమాచారంలో ఎలాంటి లోపం లేకపోయినా, పదేపదే రికార్డుల పరిశీలనకు తేదీలు కోరుతున్నట్లు కమిషన్ గుర్తించింది.
అలాగే, ఒకే దరఖాస్తుతో పలు కార్యాలయాల నుంచి సమాచారం కోరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్టీఐ చట్టాన్ని వ్యక్తిగత కక్షలు లేదా ఫిర్యాదుల పరిష్కార వేదికగా ఉపయోగించరాదని హెచ్చరించింది. పునరావృత దరఖాస్తుల కారణంగా ప్రభుత్వ ప్రజా వనరులు, సమయం వృథా అవుతున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పరిష్కరించిన అంశాలపై కొత్తగా కేసులు స్వీకరించొద్దని ఆదేశిస్తూనే, ప్రజలు కొత్తగా, భిన్నమైన సమాచారం కోరే హక్కు మాత్రం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
భద్రయ్యకు సంబంధించిన మొత్తం 164 బ్యాచ్ కేసులపై ఏపీ సమాచార శాఖ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేస్తూ అప్పీళ్లు, ఫిర్యాదులను కొట్టివేశారు. ఇదే సమయంలో డిప్యూటీ ఎంపీడీవో ఖాతా నుంచి రూ.10 వేల ఫోన్‌పే లావాదేవీపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ లావాదేవీ ఉద్దేశంపై సమగ్ర విచారణ జరపాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది.
అంతేకాకుండా, ఆయన తెల్ల రేషన్ కార్డు అర్హతపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు, కుటుంబ వివరాల ఆధారంగా తెల్ల రేషన్ కార్డుకు ఆయన నిజంగా అర్హుడేనా అనేది పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించింది. ఆర్టీఐ చట్టం అనేది కేవలం ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి మాత్రమే ఉపయోగపడాలని, దీనిని దుర్వినియోగం చేసేవారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ సంకేతాలు పంపింది.

