AP IIIT Admissions: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఆరేళ్ల సమీకృత బీ.టెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 13న విడుదల చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని కేసీ రెడ్డి చెప్పారు. దివ్యాంగుల కోటాను 3 నుంచి 5 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు చేపడతామన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారు మాత్రమే ఈ కోటాలో అర్హులని పేర్కొన్నారు. పీహెచ్‌సీ, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ తదితర ప్రత్యేక కేటగిరీ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను నూజివీడు ట్రిపుల్ ఐటీలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు.
Read Also: Warning to farmers: కొద్దిరోజులు ఆగండి.. రైతులుకు వాతావరణశాఖ హెచ్చరిక..
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. ఒక్కో క్యాంపస్‌లో ఉన్న వెయ్యి సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో వంద సీట్లు కూడా భర్తీ చేస్తామన్నారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తామని తెలిపారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ కోటాలో చేరినవారు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైనవారికి జూలై 21, 22 తేదీల్లో, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు.