NTV Telugu Site icon

Upamaka Venkateswara Swamy Temple: ఉపమాక వెంకన్న ఆలయాభివృద్ధికి సహకరించాలి: హోంమంత్రి అనిత

Minister Anitha

Minister Anitha

తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు హోంమంత్రికే స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం చైర్మన్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో హోంమంత్రి అనిత సమావేశం అయ్యారు.

ఉపమాకలో ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని చైర్మన్ బీఆర్ నాయుడిని హోంమంత్రి అనిత కోరారు. 2017లో ఆలయాన్ని టీటీడీకి అప్పగించినా.. ఇప్పటి వరకు అభివృద్ధికి నిధులు కేటాయించలేదని చైర్మన్ దృష్టికి హోంమంత్రి తీసుకెళ్లారు. హోంమంత్రి విజ్ఞప్తిపై టీటీడీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఉపమాక ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో తెలిపారు.

‘పాయకరావుపేట నియోజకవర్గంలోని ఉపమాక వెంకన్న ఆలయాన్ని 2017లో టీటీడీకి అప్పగించాం. ఆలయ అభివృద్ధికి నాడు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ అభివృద్ధికి సహకరించమని టీటీడీ ఛైర్మన్‌ను కోరాం. వెంటనే స్పందించిన ఛైర్మన్.. టీటీ డీచీఫ్ ఇంజినీర్‌ను పిలిపించి అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయమని ఆదేశించారు’ అని హోంమంత్రి అనిత తెలిపారు.