Cyclone and Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.. బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై ఏపీ హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.. వాయుగుండం ఈరోజు పశ్చిమ బెంగాల్, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉండగా.. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది.. అయితే, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి అనిత.. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా పరిశీలించారు.
Read Also: COVID-19 Vaccine: ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..
ఇక, అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా.. టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101గా ప్రకటించారు.. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.. ఇరిగేషన్, ఆర్& బి, పంచాయితీరాజ్ శాఖలతో నమన్వయ పరుచుకుని గండ్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఏపీ హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.
