కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. టీకా వల్ల గుండె జబ్బులు, గుండెపోటు కేసులు పెరిగాయని.. దీని వల్ల ఆకస్మిక మరణాలు పెరిగాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వివిధ అధ్యయనాలు దీని గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం (జూలై 25) లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ టీకా కారణంగా ఆకస్మిక మరణ ప్రమాదం పెరగలేదని స్పష్టం చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల నిర్వహించిన అధ్యయనం నివేదికను ఉటంకిస్తూ.. టీకా, పెరుగుతున్న మరణ కేసుల మధ్య ఎటువంటి సంబంధం కనుగొనబడలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్నారు. కోవిడ్ తర్వాత ఆసుపత్రిలో చేరడం, ఆకస్మిక మరణాల కుటుంబ చరిత్ర, జీవనశైలి సంబంధిత సమస్యలు ఆకస్మిక మరణానికి కారణమని నిపుణుల బృందం తేల్చిందని వెల్లడించారు.
READ MORE: Udaipur Files: “ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు: సుప్రీంకోర్టు..
“ఆకస్మిక మరణానికి గల కారణాలను పరిశోధించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) రెండు పద్ధతులను పరిశీలించాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న 47 ఆసుపత్రులలో ఒక అధ్యయనం నిర్వహించింది. అక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2023 వరకు ఆరోగ్య కరమైన వ్యక్తులు మరణించారు. వీరికి కోమోర్బిడిటీ( రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులు) లేదు. బాధితుల జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులపై డేటాను వివిధ స్థాయిలలో సేకరించారు. అధ్యయన డేటా యొక్క ప్రాథమిక విశ్లేషణలో గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) యువతలో ఆకస్మిక మరణానికి ప్రధాన కారణంగా తేలింది. అయితే, ముఖ్యంగా, కోవిడ్ మహమ్మారికి ముందు సంవత్సరాలతో పోలిస్తే మరణించడానికి గల కారణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత ఆసుపత్రిలో చేరడం, కుటుంబంలో ఆకస్మిక మరణ చరిత్ర, అధిక మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం లేదా మరణానికి 48 గంటల ముందు అధిక శారీరక శ్రమ వంటివి ఆకస్మిక మరణ అవకాశాలను పెంచింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకోవడం వల్ల ఆకస్మిక మరణ అవకాశాలు గణనీయంగా తగ్గాయని అధ్యయనంలో తేలింది.” అని నడ్డా స్పష్టం చేశారు.