NTV Telugu Site icon

Ap Highcourt: సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై హైకోర్ట్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ వసతిగృహాల నిర్వహణ తీరుపై ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తమది తొమ్మిది వేల కోట్ల బడ్జెట్‌ అని చెబుతున్న సాంఘిక సంక్షేమశాఖ.. రూ.16 లక్షల ఖర్చుతో ఓ వసతిగృహానికి అదనపు అంతస్తును నిర్మించలేకపోతున్నారా అని ప్రశ్నించింది. రూ.వేల కోట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయే గదిలో 36 మంది ఉంటున్నారని, దీనిని బట్టి చూస్తే వసతిగృహాలు ఎలాంటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది.

136 మంది విద్యార్థినులు కేవలం రెండు మరుగుదొడ్లు, మూడు స్నానపుగదులతో సర్దుకుపోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందని కోర్టు ముందు హాజరైన సంక్షేమశాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ను నిలదీసింది. వివిధ అంశాలపై న్యాయస్థానం లేవనెత్తుతున్న విషయాలను సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంపై దాఖలైన ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారం విద్యాశాఖకు చెందిందని.. ఆ విషయంలో నోడల్‌ ఏజెన్సీగా పని చేయాల్సిన అవసరం సంక్షేమ శాఖకు ఎందుకు వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందు మీ శాఖ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. 2017లో ప్రారంభించిన వసతిగృహం అదనపు గది నిర్మాణానికి రూ.16 లక్షలు కేటాయించకపోవడం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. వసతి గృహాల్లో వసతులు మెరుగుపరచాలని, విద్యార్ధినులకు వార్తాపత్రికలు అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Read Also: Mansukh Mandaviya: విజయనగరం జిల్లాలో కేంద్రమంత్రి టూర్