Site icon NTV Telugu

AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..

Mithun Reddy

Mithun Reddy

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన విచారణ పరిధి దాటి పలు అంశాలను ప్రస్తావించిందని పేర్కొంది. కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు ప్రస్తావించిన పలు అంశాల అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి Justice Venkata Jyothirmayi శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడడి (ఏ4)కి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 29న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు Siddharth Luthra, Siddharth Agarwal వాదనలు వినిపిస్తూ… ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావించిన పలు అంశాలు కేసు దర్యాప్తు మొత్తాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని తెలిపారు. మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని చెప్పారు.

బెయిల్ ఉత్తర్వుల్లో మాత్రం కేసు దర్యాప్తు ముగిసినట్లు ఏసీబీ కోర్టు పేర్కొందన్నారు. గూగుల్ టేక్ అవుట్ సాంకేతిక ఆధారాన్ని, సీఆర్పీసీ సెక్షన్ 161, 164 కింద సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారాలుగా పరిగణించలేమని ఉత్తర్వుల్లో ప్రస్తావించిందన్నారు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురి చేస్తోందన్నారు. మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లోని అంశాలను ఆధారంగా చేసుకుని తమకూ బెయిల్ మంజూరు చేయాలని ఇతర నిందితులు కోరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పలు అంశాల అమలును నిలిపివేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి, మిథున్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version