Site icon NTV Telugu

Andhra Pradesh: మున్సిపల్ కార్మికులపై కేసులు ఎత్తివేత.. ఏపీ హోంశాఖ ఉత్తర్వులు

Municipal Workers

Municipal Workers

Andhra Pradesh: సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హోంశాఖ.. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై నమోదైన 6 కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో.. మున్సిపల్‌ కార్మికులపై ఫిర్యాదు చేశారు మున్సిపల్‌ అధికారులు.. దీంతో, వారిపై కేసులు పెట్టారు పోలీసులు.. కానీ, ఆ సమయంలో మున్సిపల్ అధికారుల చేసిన ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈమేరకు డీజీపీకీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు.. మున్సిపల్‌ కార్మికుల సమ్మె సమయంలో ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ స్పష్టం చేసింది.

Read Also: Civil Supplies Department: ధాన్యం తాజా టెండ‌ర్లతో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.1,110.51 కోట్ల లాభం..

కాగా, ఏపీలో మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు దిగారు.. పలు డిమాండ్ల సాధన కోసం కదం తొక్కారు.. అయితే, పలు మార్లు చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరకు చర్చలు సఫలం చేసింది.. దీంతో.. సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో.. సమ్మె ముగిసిపోయింది.. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని ఈ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్న విషయం విదితమే.. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని చర్చల సందర్భంగా వెల్లడించినట్టుగానే.. ఇప్పుడు కేసులను ఉపసంహరించుకుంది ఏపీ సర్కార్.

Exit mobile version