ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు అమల్లో ఉన్న డీఏ శాతాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ప్రస్తుతమున్న 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఉద్యోగులకు అదనంగా 2.73 శాతం డీఏ పెంపు లభించినట్లయింది. ఈ పెంపును 2024 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ డీఏ పెంపు లబ్ధి కేవలం సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా మరికొన్ని వర్గాల వారికి కూడా వర్తించనుంది. ప్రధానంగా 2022 రివైజ్డ్ పే స్కేల్స్ (వేతన సవరణ) ప్రకారం వేతనాలు పొందుతున్న ఉద్యోగులందరికీ ఈ డీఏ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే.. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు తదితర స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఇవే కాకుండా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి, అలాగే రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల (యూనివర్సిటీల) బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఈ డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.

