NTV Telugu Site icon

SP Ramakrishna: ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్‌ మృతి.. రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Sp Ramakrishna

Sp Ramakrishna

SP Ramakrishna: అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ రామకృష్ణ.. అసలు ఆ ఘటన ఎలా జరిగిందో వివరించారు.. ఎర్రచందనం తరలిస్తున్నారన్న రహస్య సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు.. ఆ సమయంలో పొరపాటుగా స్మగ్లర్ల వాహనం కానిస్టేబుల్ ను ఢీకొట్టిందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుడు కానిస్టేబుల్ గణేష్ కుటుంబానికి ప్రభుత్వం 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిందని వెల్లడించారు.. అతని కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. ఇక, ఈ ఘటనలో పరారైన ముగ్గురు స్మగ్లర్లు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ రామకృష్ణ.

Read Also: Ponnam Prabhakar : ఇది అధికారుల బాధ్యత ఒక్కటే కాదు.. సామాజిక బాధ్యత కూడా

కాగా, అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద పోలీసు సిబ్బంది కాపు కాశారు. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల తనిఖీలను గుర్తించి వేగంగా వారిని ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎర్రచందనం వాహనాన్ని కానిస్టేబుల్ గణేష్‌ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో ఎర్రచందన స్పగ్లర్లు అతడిని ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. 2013 బ్యాచ్ కానిస్టేబుల్ గణేష్, 14వ బెటాలియన్‌‌లో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం గణేష్ డిప్యుటేషన్ పై యాంటీ స్మగ్లర్ టాస్క్ ఫోర్స్‌కు వచ్చాడని సహచరులు తెలిపారు. కానిస్టేబుల్‌ మృతితో అతని కుటుంబసభ్యులు తీవ్రంగా విలపించారు. కానిస్టేబుల్‌ గణేష్‌కు భార్య అనూష, ఇద్దరు పిల్లలు రాజ్ కిశోర్ (6) వేదాన్ష్ (3) ఉన్నారు.