NTV Telugu Site icon

AP Govt: శాంతి భద్రతల పరిరక్షణపై ఏపీ సర్కార్ ఫోకస్

Ap Govt

Ap Govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరి కొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త ఇనిషియేటివ్.. పోలీసు అధికారుల పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకంగా సర్కార్ నిఘా పెట్టింది. ఎస్సై నుంచి ఉన్నతాధికారి వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామాల వారీగా డేటా సేకరణ, ప్రజల్లో అవగాహన పెంచటం, అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ ఇవ్వడం లాంటివి చేసేందుకు కసరత్తు చేస్తుంది. పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాల గుర్తింపు.. చిత్తూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా కొనసాగనుంది. ఇక, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

Read Also: Fire Accident: కజకిస్తాన్‌లోని అల్మాటీ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం, 13 మంది మృతి

ఇక, పోలీస్ స్టేషన్ల వారీగా అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు పోలీస్ అధికారులు వివరించనున్నారు. జైలు నుంచి విడుదలై వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు స్థానికేతరులపై కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచనున్నారు. ఇక, జిల్లాల వారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను పోలీసుల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరించనున్నారు. ఆ డేటా మొత్తం ప్రత్యేక యాప్‌లో ఎంటర్ చేయనున్నారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి జిల్లా ఎస్పీ ఆఫీసు వరకు అందుబాటులో ఉండనుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా సహాయపడుతుంది.