NTV Telugu Site icon

Free Bus Scheme: కర్ణాటక బస్సులో ఏపీ మంత్రుల ప్రయాణం.. సీఎంను కలవనున్న కేబినెట్ సబ్ కమిటీ!

Free Bus Scheme

Free Bus Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటిస్తోంది. కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంటోంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల బృందం కలవనుంది.

ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటకలో అధ్యయనం చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ‘కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తున్నాము. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో బెంగళూరులో పర్యటించడం జరిగింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో చర్చిస్తున్నాము. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో కలిసి ఈ పథకం అమలు చేయడంపై కసరత్తు జరుగుతోంది. కర్ణాటకలో మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నాం’ అని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

అయితే కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో భారం మోపింది. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. ‘శక్తి పథకం’ పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో 2023 జూన్‌ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇపటివరకు రూ.1,694 కోట్లు బకాయి పడింది. అందుకే ఈ బాదుడుకు చర్యలు తీసుకుందని తెలుస్తోంది.

Show comments