NTV Telugu Site icon

AP Elections 2024: పోలింగ్‌ ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు.. సీఎస్‌కు డీజీపీ నివేదిక

Dgp Cs

Dgp Cs

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముందు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి నివేదిక ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా.. ఎన్నికల ముందు తర్వాత హింసాత్మక ఘటనలు జరిగేందుకు బాధ్యులైన 12 మంది సబార్డినేట్ పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు.. శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారు.. దీంతో.. డీజీపీ నివేదిక మేరకు వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ శాఖా పరమైన విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. తిరుపతి, అనంతపురం, పలనాడు జిల్లాల సబర్దినేట్ అధికారులు తమ విధుల్లో తీవ్ర స్థాయి నిర్లక్ష్యం వహించారని స్పష్టం చేసింది నివేదిక.. పలనాడు జిల్లా, అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకర్గంలో ఎన్నికల ముందు, తర్వాత హిసాత్మక ఘటనలు జరిగాయని స్పష్టం చేసింది..

Read Also: Delhi : ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక

ఇక, ఈ ప్రాంతాల్లో వేర్వేరు హోదాల్లో ఉన్న పోలీసు అధికారులు అనైతికంగా, విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేశారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ. జరిగిన ప్రతీ హింసాత్మక ఘటనలోనూ సదరు పోలీసు అధికారుల పూర్తి నిర్లక్ష్యం, ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఘటనల తీవ్రత పెంచాయని వెల్లడించింది డీజీపీ నివేదిక. చట్టాన్ని, శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా పోలీసు అధికారులు విఫలం అయినట్టు స్పష్టం చేసింది.. జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలోనూ అలాంటివి జరగకుండా శాంతి భద్రతలు కాపాడటంలో ఈ అధికారులు విఫలం అయినట్టు వెల్లడించారు. విధుల పట్ల ఈ అధికారుల నిజాయితీ, నిబద్ధతపై కూడా అనుమానం వ్యక్తం అవుతోందని డీజీపీ నివేదిక పేర్కొంది. ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో వీరు పూర్తిగా విఫలం అయ్యారని స్పష్టం చేసింది.. ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల్లోని సెక్షన్ 3(1)ను వీరు పూర్తిగా అతిక్రమించారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా..

Read Also: Swati Maliwal: విభవ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. కేసు దర్యాప్తులో నిమగ్నమైన 10 బృందాలు

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) రియాక్షన్‌ మొదలయింది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్‌ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు.. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి పోలీస్ అధికారులపై కూడా వేటు వేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త FIR రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ.. సీఎస్, డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించిన విషయం విదితమే.