NTV Telugu Site icon

Narayana Swamy: పురంధరేశ్వరి ఏ పార్టీయో..? అర్థం కావడం లేదు.. లిక్కర్‌ పాలసీపై సీబీఐ విచారణకు రెడీ..!

Narayana Swamy

Narayana Swamy

Narayana Swamy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పురంధరేశ్వరిలో తన మరిది చంద్రబాబును కాపాడుకునే తపన తప్ప వేరే కనపడటం లేదని దుయ్యబట్టారు.. ఎన్టీఆర్ కూతురు అని చెప్పుకునే అర్హత ఈమెకు లేదని ఫైర్‌ అయ్యారు. ఇక, పురంధరేశ్వరి ఏ పార్టీ యో.. నాకు అర్థం కావడం లేదని సెటైర్లు వేసిన ఆయన.. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే.. ఈమె చంద్రబాబును వెనకేసుకు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణ స్వామి.. లిక్కర్‌ పాలసీ పై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు.. మద్యపానం పెడితే తప్పా.. అంటూ ఆనాడు కొన్ని పత్రికలు రాశాయని దుయ్యబట్టారు. మద్యపానం నిర్మూలించినది ఎన్టీఆరే.. కానీ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కొని, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. 1998లో మద్యపాననిషేధం ఎత్తివేయక పోతే ప్రభుత్వం నడపలేమని చంద్రబాబు ప్రకటించి ఎత్తివేశారని గుర్తు చేశారు. ఇక, గుడి బడి అని చూడకుండా 4378 ప్రవేట్ వైన్ షాప్ లు, 43 వేల బెల్ట్ షాప్ లు పెట్టారని మండిపడ్డారు. ప్రెసిడెంట్ మోడల్, డీలక్స్ విస్కీ, గవర్నర్ విస్కీ, బూమ్ బూమ్‌ బీర్‌కు 2017లో చంద్రబాబు పాలనలో అనుమతి ఇచ్చారని తెలిపారు.

మరోవైపు.. యనమల రామకృష్ణుడు బంధువులు, అయ్యన్న పాత్రుడు, డీకే ఆదికేశవులు నాయుడు, నంద్యాల ఎస్పీవై రెడ్డిలకు టీడీపీ నేతలకు చెందిన వారికే డిస్టిలరిలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు పాలనలోనే అన్నారు నారాయణ స్వామి.. సీబీఐ విచారణ వద్దని చంద్రబాబు నాయుడు వెనకడుగు వేశారని తెలిపారు. ఎన్టీఆర్ బొమ్మ లేకుండా గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా..? అని సవాల్‌ చేశారు.. లోకేష్, పవన్ కల్యాణ్‌ ఫొటో పెట్టుకుని చంద్రబాబు ఒక్క సీటు అయినా గెలుస్తాడా..? అలా గెలుస్తే నేను రాజకీయాలు వదిలేస్తాను అంటూ చాలెంజ్‌ విసిరారు.. 2014 నుంచి ఎక్సైజ్‌ పాలసీపై సీబీఐ విచారణకు మేం సిద్ధం.. మేం ఎప్పుడూ భయపడం అని సవాల్‌ విసిరారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..