AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు!

Ap Cyclone Alert

Ap Cyclone Alert

AP Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం మంగళవారం-బుధవారం నాటికి మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని సూచించింది. తుఫాన్‌ ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా సుమారు 860 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా దాదాపు 1,040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా తీవ్రత పెంచుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌గా బలపడిన అనంతరం ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు కదిలి.. తీరం దాటే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

తుఫాన్‌ ప్రభావంతో సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈరోజు సాయంత్రంలోగా తీరానికి తిరిగి రావాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తదుపరి సూచనలు వచ్చే వరకు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. తుఫాన్‌కు సంబంధించిన తాజా సమాచారం, అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని తీర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.