CM YS Jagan: ఏపీలో ఎన్నికలకు కౌంట్‌డౌన్ దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్.. వై నాట్ కుప్పం అంటూ చంద్రబాబు అడ్డాలో అడుగుపెడుతున్నారు. కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు సీఎం జగన్. కుప్పంలో గెలుపుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా సంక్షేమం, ఇంటి స్థలాలు, గడప గడపకు ప్రభుత్వం వెళ్లేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Revanth Reddy: లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
ఇప్పటికే కుప్పం కేంద్రంగా పలు నిర్ణయాలు ప్రకటించిన జగన్.. ఈ నెల 26న కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి అందించనున్నారు. కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన క్రెడిట్ వైసీపీదేనని చెబుతున్నారు. కుప్పంలో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తరువాత నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలకు సంసిద్దత పైన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సమీక్షించనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. తమ తొలి గెలుపు కుప్పంతోనే ప్రారంభం కావాలని ఇప్పటికే పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. కుప్పం, మంగళగిరితో పాటుగా పవన్ పోటీ చేసే అవకాశం ఉన్న భీమవరం పైన ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నారు. కుప్పంలో గెలవాలని నిర్ణయించుకున్న సీఎం జగన్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో జగన్ కుప్పం పర్యటనపై ఆసక్తి నెలకొంది.