NTV Telugu Site icon

Ambedkar Statue: భారీ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

Ambedkar Statue

Ambedkar Statue

Ambedkar Statue: విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పాల్గొని ప్రారంభించనున్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగులతో రూ. 400 కోట్లు నిధులతో దీన్ని నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఇక ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. జనవరి 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేశారు. తొలి రోజు 1.20 లక్షల మంది తరలివస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Minister Kakani Govardhan Reddy: మరోసారి చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయం

విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం నేపథ్యంలో వైసీపీ పలు కార్యక్రమాలు చేపట్టింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించనుంది. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని అంబేడ్కర్‌ విగ్రహం వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నాయి. ఇదిలా ఉండగా.. వైసీపీ నాల్గవ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాలుగవ లిస్ట్‌ను విడుదల చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు లేదా రేపు 4వ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 15 నుంచి 20 స్థానాలతో 4వ లిస్టు విడుదల చేయొచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా లిస్ట్ గురించి చర్చించేందుకు ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు,ఎంపీలు రానున్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కారణంతో.. మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్‌ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ ఆ చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Show comments