Site icon NTV Telugu

AP CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్‌.. ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి !

Jagan Delhi Tour

Jagan Delhi Tour

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొననున్నారు. కేవలం ఆ సమావేశంలో పాల్గొనడమే కాకుండా.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి జగన్ మాట్లాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే నీతి ఆయోగ్‌ సమావేశంలో మాట్లాడే అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. అలాగే ఏపీ సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు.

Read Also: Amaravathi: 50 వేల మంది పేదలకు గుడ్‌న్యూస్.. నేడే ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమని.. దాని కోసం ఏం చేయాలో.. అది చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడంతో పాటు.. కీలక వ్యక్తులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.

Exit mobile version