CM Chandrababu: సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్ధిష్ట ప్రణాళితలో ముందుకెళ్లాలన్నారు. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకుడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలన్నారు. తనిఖీలు అనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలన్నారు. అంతే కానీ తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురిచేయవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తరవాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదని.. ఇలా కాకుండా నిర్థిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేయడంతో పాటు నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. తనిఖీలతో పాటు థర్డ్ పార్టీ ద్వారా కూడా ఆడిట్ జరపాల్సిన అవసరం ఉందన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని.. అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642 వేల ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయని వాటిలో 11.78 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి ముగ్గురు కెమికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉండాలన్నారు. రాష్ట్రంలో 3,700 బాయిలర్స్ ఉన్నాయని, ప్రతి ఏడాది వీటిని చెక్ చేస్తున్నామన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
Read Also: Venkaiah Naidu: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను మాతృభాషలోనే విడుదల చేయాలి..
ఈఎస్ఐ ఆస్పత్రుల బలోపేతం
మన రాష్ట్రంలో ఉన్న నాలుగు ఈఎస్ఐ ఆసుపత్రుల బలోపేతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 2014 నుంచి 2019 మధ్య ఈఎస్ఐ వైద్య సేవలు పొందే వారి సంఖ్య 5 లక్షల నుంచి 11 లక్షలకు పెరిగితే.. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఈఎస్ఐ సేవలు తగ్గాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. సీనియర్ డాక్టర్ మాత్రమే ఈఎస్ఐ ఆసుపత్రికి సూపరింటెండెంట్‌గా ఉండాలని నిబంధనలు ఉన్నా.. గత ప్రభుత్వం దాన్నీ తుంగలో తొక్కిందన్నారు. వైఎస్ఆర్ బీమాలో జరిగిన అక్రమాలను ఈ సందర్బంగా మంత్రి .. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై సమాచారం సేకరించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేదలకు అందే సాయంలోనూ అక్రమాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించకూడదని.. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులతో మాట్లాడి ఈ విషయంలో ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
ఈఎస్ఐ పెండింగ్ బిల్లులు క్లియర్
ఈఎస్ఐ ఆసుపత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ. 54 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్పగా.. వాటి విడుదలకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సర్వీసులు అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా సేవలను మెరుగుపరిచే విషయంలో కసరత్తు చేయాలని సూచించారు. లేబర్ వెల్‌ఫేర్ బోర్డు, మినిమం వేజెస్ బోర్డు, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డులను యాక్టివ్ చేసి కార్మకుల హక్కులు, సంక్షేమం అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
గడిచిన ఐదేళ్లలో చంద్రన్న బీమా నిర్వీర్యం-లబ్ధిదారుల్లో భారీ కోత
‘కార్మికులకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ప్రారంభించిన చంద్రన్న బీమాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నాటి తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో అసంఘటిత రంగంలోని కార్మికులకు అందరికీ బీమా వర్తింప చేయగా…వైసీపీ ప్రభుత్వం లబ్దిదారులను సంఖ్యను కుదించేసింది. 2014-19 మధ్య బీమా కింద 2.50 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా గత ప్రభుత్వం దాన్ని 1.22 కోట్లకు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా బీమా పథకం అమలు చేస్తామని మొత్తం కార్యక్రమాన్నే నిర్వీర్యం చేశారు. నాడు సహజ మరణాలకు రూ.2 లక్షలు, ప్రమాద మరణాలకు రూ. 5 లక్షలు ఇచ్చాము. కానీ వైసీపీ ప్రభుత్వం సహజ మరణాలకు కేవలం రూ.1 లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంది. టీడీపీ హయాంలో సహజమరణం పొందిన 3,08,440 మందికి బీమా క్లెయిమ్ ద్వారా రూ.3393 కోట్లు చెల్లించగా.. గత ప్రభుత్వం కేవలం 91 వేల మందికి రూ.1025 కోట్లు మాత్రమే చెల్లించింది. నాడు ప్రమాదవశాత్తూ మరణించిన 30888 మందికి బీమా చెల్లింపుల ద్వారా రూ.1360 కోట్లు చెల్లించగా, గత వైసీపీ ప్రభుత్వం కేవలం 9938మందికి రూ.496 కోట్లు నామమాత్రంగా చెల్లించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో మూడేళ్లలో చంద్రన్న భీమా ద్వారా రూ.4,753 కోట్లు బాధిత కుటుంబాలకు అందించంది. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 1521 కోట్లు మాత్రమే ఇచ్చింది. చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు ఇస్తామనే ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నాం..త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం. కార్మికులకు బీమా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించాము. కేవలం కార్మికులే కాకుండా ఉపాథి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాల వారికి బీమా అందించేలా పథకాన్ని డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించాము. డ్వాక్రా సంఘాల ద్వారా ప్రమాద బీమా కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తామని’ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.