ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకోగానే లబ్ధిదారులు, సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ స్థానాల్లో నిలబడి చేతులు ఊపుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజల ఉత్సాహానికి ప్రతిగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నడుస్తూ అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు.
ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పేదలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశంతోనే రాజముద్ర వేసి మరీ ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా కల్పించే పూర్తి బాధ్యత తమ కూటమి ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చేశారు.
అంతే కాకుండా.. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే పట్టాలు అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మరో 35 కాలనీల్లో పది వేల మంది ఇళ్ల పట్టాలు కోరుతున్నారని, అలాగే దేవస్థానానికి చెందిన పంచగ్రామాల్లో మొత్తం 12,149 మందికి చట్టబద్ధంగా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు దక్కేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ ప్రాంతానికి ఏకంగా 91 కొత్త ప్రాజెక్టులు వచ్చాయని, దీనివల్ల స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రను మరింత ముందుకు తీసుకువెళ్తామని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

