ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎనిమిదో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ ముఖ్యమైన సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖల విభాగాధిపతులు హాజరుకానున్నారు. గతంలో నిర్వహించిన ఏడో కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై చేపట్టిన చర్యల నివేదికతో మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్‌లో మొత్తం 19 కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి, సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సదస్సులో భాగంగా ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు, శాంతిభద్రతలు వంటి ప్రధాన విభాగాలపై సమీక్షలు చేపడతారు. ప్రభుత్వ సేవలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ కలెక్టర్లకు ముఖ్యమంత్రి తగిన దిశానిర్దేశం చేయనున్నారు. మొదటి రోజు సమావేశంలో ముఖ్యంగా జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్‌కు సంబంధించిన జిల్లా స్థాయి రోడ్‌మ్యాప్‌లపై సమీక్షిస్తారు. దీనితో పాటు సూపర్ సిక్స్ పథకాల పురోగతి, తాగునీరు, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యా రంగాల అభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార వంటి అంశాలపై చర్చిస్తారు. అలాగే పలు జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను కలెక్టర్లు ప్రదర్శించనున్నారు.
రెండో రోజు సదస్సులో పాలన సంబంధిత అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరు, జిల్లాల వారీ ర్యాంకింగ్స్‌పై సమీక్ష నిర్వహిస్తారు. వీటితో పాటు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీస్తారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వం వహించనున్నారు.

