ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ఆయన భౌతికకాయం చేరుకుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ,ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి.
సోదరుడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నివాసం నుంచి బేగంపేట్‌కు సీఎం వెళ్తారు. 9.20కు బేగంపేట్ నుంచి ప్రత్యక విమానంలో తిరుపతికి బయల్దేరతారు. 10.5కు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గాన 10.50కి నారావారిపల్లెకు వెళ్లి రామ్మూర్తినాయుడి అంత్యక్రియల్లో పాల్గొంటారు.
గుండె సంబంధిత సమస్యలతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు (72) శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యాధునిక చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం సహకరించలేదు. మధ్యాహ్నం 12.45 గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, కుమారులు గిరీశ్, రోహిత్ ఉన్నారు. రోహిత్ సినీ హీరో కాగా, గిరీశ్ గల్ఫ్‌లో వ్యాపారం చేస్తున్నారు.