NTV Telugu Site icon

Fibernet Scam Case: చంద్రబాబుకు మరో షాక్‌.. ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌..

Fibernet Scam

Fibernet Scam

Fibernet Scam Case: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. చంద్రబాబుపై మరో పీటీ వారెంట్‌ నమోదైంది.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ పీటీ వారెంట్‌ నమోదైంది.. ఫైబర్‌ నెట్‌ కేసులో ఈ పీటీ వారెంట్‌ నమోదు చేశారు.. ఇప్పటికే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ వ్యవహారంలో పీటీ వారెంట్‌ జారీ చేసింది సీఐడీ.. అయితే, ఇప్పుడు తాజాగా ఫైబర్‌ నెట్‌ కేసులోనూ సీఐడీ వర్గాలు పీటీ వారెంట్‌ నమోదు చేయడం.. దీనిని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబును నిందితుడి పేర్కొంటూ పీటీ వారెంట్‌ నమోదు చేసింది సీఐడీ.. టెరాసాఫ్ట్‌ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్‌ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.. దాని ద్వారా స్కామ్‌కు పాల్పడ్డారని.. ఈ వ్యవహారంలో దాదాపు రూ.321 కోట్ల మేర అవకతవకలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది.. ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతంరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఇప్పటికే 9 మందిని విచారించి.. కొందరిని అరెస్ట్‌ చేశారు.. ఇప్పుడు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేశారు.

అయితే, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో వాదనలు ముగిసాయి.. తీర్పు రిజర్వ్‌ చేసింది హైకోర్టు.. రిమాండ్‌ రిపోర్ట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. మరోవైపు.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో పీటీ వారెంట్‌ పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌ నమోదైంది.. అయితే, ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లను అన్నింటినీ కలిపి విచారణ జరుపుతుందా? లేదా విడివిడిగా విచారణ జరుపుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ కోర్టు.. కోర్టు సమయం ముగియడంతో రేపు విచారిస్తామన్నారు న్యాయమూర్తి.. హైకోర్టు ఆర్డర్‌ కాపీ వచ్చాకే బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తంగా.. చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.

Show comments