Arnab Cyclone: ఏపీలో సంభవించిన అర్నబ్ తుఫాన్ తీవ్ర నష్టాలను, అలాగే ఖరీఫ్-2026 కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అర్నబ్ తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాష్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఇవాళ, రేపు పర్యటించనుంది. మొదట ఆర్టీజీఎస్ (RTGS)లో తుఫాన్ సమయంలో చేపట్టిన చర్యలు, జరిగిన నష్టాలపై అధికారులు కేంద్ర బృందానికి వివరణ ఇస్తారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాయి. ఇవాళ కోనసీమ జిల్లాలో మొదటి బృందం, తూర్పుగోదావరిలో రెండో బృందం పర్యటించగా, రేపు కాకినాడలో మొదటి బృందం, పశ్చిమగోదావరిలో రెండో బృందం పర్యటించి తుఫాన్ బాధితులతో మాట్లాడతాయి. ఆయా ప్రాంతాల్లో జరిగిన పంటలు, ఆస్తుల నష్టాలను స్వయంగా పరిశీలించాక, సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ బృందం సమావేశమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, ఖరీఫ్-2026 కరువు పరిస్థితుల అధ్యయనానికి కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ చిన్మయ్ గోట్మారే నేతృత్వంలో 10 మంది సభ్యుల మరొక కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. ఈ బృందం సోమ, మంగళవారాల్లో శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తుంది. రెండు బృందాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడనున్నాయి. ఖరీఫ్-2026లో 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ నిబంధనల ప్రకారం కరువు పరిస్థితులపై ఈ బృందం లోతుగా అధ్యయనం చేయనుంది.

