AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!

Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

AP Cabinet Meeting: అమరావతిలో రేపు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు వంటి అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇప్పటికే వివిధ అంశాలకు ఆమోదం లభించిన నేపథ్యంలో, వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్ల వ్యయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్లలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు రూ.2540 కోట్ల ఖర్చుకు కూడా అనుమతి ఇవ్వనుంది.

ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనంలో సివిల్ స్ట్రక్చర్ పనుల కోసం రూ.798 కోట్లను మంజూరు చేసే అంశం కూడా చర్చకు రానుంది. ఎల్పీఎస్ జోన్-11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధానిలో 220 KV విద్యుత్ లైన్ల రీరూటింగ్ అంశం కూడా అజెండాలో ఉంది.

రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడం కూడా కేబినెట్ పరిశీలించనుంది. మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేలుగా, జరీబు భూములకు రూ.60 వేలుగా కౌలు పెంపును ఆమోదించే అవకాశం ఉంది. అదనంగా ప్రతి సంవత్సరం మెట్ట భూములకు రూ.3000 చొప్పున, జరీబు భూములకు రూ.5000 చొప్పున పదేళ్ల పాటు పెంపు ఇవ్వాలనే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియాకు 1.78 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4.23 ఎకరాలు, అగ్నిమాపక శాఖకు రాయపూడి వద్ద 2 ఎకరాలు, డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాలు, ఆప్కాబ్‌కు 0.49 ఎకరాలు కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కేబినెట్ అభినందనలు తెలిపే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో డీజిల్ సమస్యపై కూడా చర్చ జరగనుంది.