AP Cabinet: రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక,ఆర్థిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల ఎంపికపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో చెత్త పన్ను రద్దుపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.
Read Also: Drone Summit 2024: ఆకాశంలో అద్భుతం.. కృష్ణా తీరంలో 5,500 డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షో
చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటుపై సమావేశం చర్చించనుంది.
Read Also: CM Chandrababu: రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
కేంద్రం ఈ పథకం కోసం ఇచ్చే నిధుల సద్వినియోగం పైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం తాజాగా రూ 2,800 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు పనుల గురించి ఈ భేటీలో అధికారులు వివరించనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం..తదుపరి అడుగుల గురించి చర్చించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చిస్తారని సమాచారం.
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాల పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వీటితో పాటుగా వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు.. వేతనాల చెల్లింపు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకం పైన నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.