NTV Telugu Site icon

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: నేడు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్‌లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం ప్రకటిస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామన్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో చర్చించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కేబినెట్‌లో చర్చించనున్నారు.

Read Also: AP Assembly: రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌2024-25ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. యూనియన్‌ బడ్జెట్‌లో ఏపీ మంచి కేటాయింపులే దక్కాయి.. బడ్జెట్‌ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలమ్మ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న విషయం విదితమే. అయితే, ఈ కేటాయింపులపై విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి.. మరోవైపు.. ఏపీ పాలిటిక్స్‌ ఢిల్లీ చేరాయి.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

Show comments