ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (నవంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ హాజరుకావటం లేదు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే హాజరుకానున్నాయి. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. తన నివాసం నుంచే మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. తనకు అసెంబ్లీలో మాట్లాడటానికి ఎక్కువ సమయం మైక్ ఇవ్వల్సి వస్తుందేమోననే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ పేర్కొన్నారు.
అసెంబ్లీ కంటే ముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ఆర్ధిక సంవత్సరం మిగిలి ఉన్న కాలానికి బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనునుంది. బీఏసీ అనంతరం అసెంబ్లీ సమావేశం జరగనుంది. బీఏసీలో అసెంబ్లీ నిర్వహణ, మినిట్స్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ముందుగా గవర్నర్ ప్రసంగిస్తారు. ఆపై అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. రెండు రోజుల తర్వాత మళ్లీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి బడ్జెట్‌కు సంబంధించిన ఏజెండా అంశాలను వివరించారు.