Andhrapradesh: ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం చేసింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది. జనసేన మిత్రపక్షమని తీర్మానంలో ఏపీ బీజేపీ పునరుద్ఘాటించింది. రాజకీయ తీర్మానంలో టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ ప్రస్తావించకపోవడం గమనార్హం. టీడీపీతో పొత్తు అంశాన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడాలని పార్టీ ఏపీ ముఖ్య నేతల సూచించారు.
బీజేపీ రాజకీయ తీర్మానం ఇదే..
2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రజలు ఏంతో నమ్మకంతో గెలిపిస్తే రాష్ట్రంలో నాటి ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కలిగింది. సవ్యంగా సాగుతున్న ప్రభుత్వం వైసీపీ ట్రాప్‌లో పడి 2018లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాష్ట్రంలో పాలన అదుపు తప్పి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగింది. రాష్ట్రంలో నేడు ఏ వర్గానికి లేదా ఏ ప్రాంతానికి చెందిన ప్రజలను కదిలించినా రాష్ట్రంలో ప్రస్తుతం పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అరాచకాల పైనే చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల విధుల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెంది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను అధ్వాన్న ఆంధ్రప్రదేశ్‌గా మార్చి వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం అందించే సంక్షేమ పథకాలు మరియు కేంద్ర ప్రభుత్వ రైలు, జాతీయ రహదారులు మినహా రాష్ట్రంలో ఏ అభివృద్ధి లేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పాలనలో సృష్టించిన ప్రళయం ప్రభావం కనీసం రాబోయే 25 సంవత్సరాలు ఉంటుందని సర్వత్రా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
11 అంశాలు ఇవే..
1) ఆర్థిక బీభత్సం,
2) మౌలిక సదుపాయాల కల్పనలో అధమం
3) పంచాయితీల హక్కుల హననం:
4) ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు
5)రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు లేవు – యువతకు ఉపాధి లేదు
6) రాజధాని అమరావతి
7) అస్మదీయుల కోసం భూదోపిడి
8) రాష్టంలో కరువు పరిస్థితి
9) రైతుల ఆత్మహత్యలు
10)కేంద్ర నిధుల దుర్వినియోగం
11)జనసేన మిత్రపక్షం :
ఎన్డీఏ మిత్రపక్షం జనసేనతో కలిసి రాజకీయ ప్రయాణం, జనసేన పార్టీ ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో మా ప్రయాణం కొనసాగుతుంది. జనసేన పార్టీతో మా పార్టీ కలసి చేసే భవిష్యత్ కార్యాచరణ మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కొనసాగుతున్నదని తీర్మానిస్తున్నాము.