NTV Telugu Site icon

Purandeshwari: ప్రధాని మోడీ బర్త్‌డే.. పేదలకు చీరలను పంపిణీ చేసిన పురంధేశ్వరి

Purandeshwari

Purandeshwari

Purandeshwari: విజయవాడలోని వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భగవంత్ కుబా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. పేదలకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

కేంద్ర నాయకత్వం పొత్తులపై నిర్ణయిస్తుందని దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలతో పవన్ మాట్లాడతాం అన్నారని.. మాతో భాగస్వామిగా ఉన్నట్టే కదా అంటూ వ్యాఖ్యానించారు. సీఐడీ కేసు పెట్టి అరెస్టు చేసిందని.. బీజేపీ స్పందించేదేం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు విధానం సరిగా జరగలేదని తాము ఖండించామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విశ్వ కర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన పథకం అమల్లోకి తెచ్చారన్నారు. చేతి వృత్తులపై ఆధారపడిన హస్త కళాకారులకు రుణాలు మంజూరు చేస్తున్నారని ఆమె వెల్లడించారు. బీజేపీ ఎప్పుడూ సేవకు పెద్ద పీట వేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ కూడా తాను ప్రధాని‌ని కాదు.. దేశ సేవకుడిని అని ప్రకటించుకున్నారన్నారు. మహిళల అభ్యన్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని.. మోడీ పుట్టిన రోజున ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ ఎప్పుడూ ఓట్ల కోసం కాదు.. ప్రజలకు సేవ చేయడం పైనే దృష్టి పెడుతుందన్నారు.

Also Read: PM Modi Birthday: మీరు ప్రధాని మోడీకి డైరెక్ట్ గా బర్త్ డే విషెస్ చెప్పాలనుకుంటున్నారా..?

విశ్వకర్మ యోజన పథకం గురించి మాట్లాడుతూ.. హస్తకళల అభివృద్ధిలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ అందించడం ఈ స్కీం ఉద్దేశమని పురంధేశ్వరి వెల్లడించారు. బీజేపీ పేదల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కార్యక్రమాలు చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రతీ పేద వాడికీ 5 లక్షలు అందిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ మాత్రమే ఏపీలో అమలులో ఉంది.. ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డును పేదలకు అందిస్తున్నాం.. దీనితో దేశంలో ఎక్కడైనా వైద్యసేవలు పొందచ్చని ఆమె తెలిపారు. గాంధీ జయంతి వరకూ ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

భారత సనాతన కాలం నుంచీ వసుధైవ కుటుంబకం అని అందరికీ తెలుసని కేంద్రమంత్రి భగవంత్ కుబా పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్ళలో మోదీ ప్రభుత్వ పథకాలతో 13.5 కోట్ల పేదల స్ధితిగతులు మారాయన్నారు. అందరికీ విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్ధికస్ధితిని మెరుగుపరచడానికి ఎదిగిన పేదలు ప్రధాన పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి వివరించారు. చేతివృత్తుల వారిని సమాజ నిర్మాణం చేసేవారుగా మోడీ చూశారన్నారు. విశ్వకర్మ సమాజం సంఖ్యలో చిన్నదేమో.. కానీ వృత్తుల విషయంలో అతిపెద్దది అని వ్యాఖ్యానించారు. విశ్వకర్మ యోజన ద్వారా 25 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. విశ్వకర్మ సమాజం చేసే వస్తువులకు తయారీ నుంచి మార్కెట్‌లో అమ్ముడయ్యే వరకూ పూర్తి సహకారం అందించేది విశ్వకర్మ యోజన అని వివరించారు. అతి తక్కువ వడ్డీకి లక్ష రూపాయల నుంచి 3 లక్షల వరకూ రుణ సదుపాయం విశ్వకర్మ యోజన ద్వారా అందిస్తామన్నారు. రూ. 13 కోట్ల నిధులు ఈ విశ్వకర్మ యోజనకు కేటాయిస్తామన్నారు.