AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..

Ap Assembly 2025

Ap Assembly 2025

అమరావతి: రహిత) అసెంబ్లీగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో ‘నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్’ (NeVA) సమర్థవంతంగా అమలు చేసేందుకు అసెంబ్లీ సచివాలయం వేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటినీ NeVA పోర్టల్‌కు అనుసంధానం చేయడం ద్వారా శాసనసభ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చాలని నిర్ణయించారు.

ఈ డిజిటల్ విధానంపై అవగాహన కల్పించేందుకు మంత్రుల ప్రైవేట్ సెక్రటరీలకు (పీఎస్‌లు) ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభ సమావేశాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ నోటీసులకు ఆన్‌లైన్ ద్వారానే వేగంగా సమాధానాలు పంపే విధానంపై ఈ శిక్షణలో పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. దీనివల్ల ఫైళ్ల కదలికలో జాప్యం తగ్గి, కాగితాల వినియోగం పూర్తిగా తగ్గిపోనుంది.

నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగనుంది. అమరావతిలోని ఏపీ శాసనసభ కమిటీ హాల్ నంబర్-2లో ఈ తరగతులను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విడతల వారీగా వివిధ శాఖల మంత్రుల పీఎస్‌లకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.

షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18వ తేదీన ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తొలి విడత శిక్షణ జరుగుతుంది. ఈ మొదటి సెషన్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల ప్రైవేట్ సెక్రటరీలతో పాటు వ్యవసాయం, ఐటీ, విద్య, మైనింగ్ శాఖల మంత్రుల పీఎస్‌లకు NeVA పోర్టల్ వినియోగంపై సాంకేతిక నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. మిగిలిన శాఖల మంత్రుల పీఎస్‌లకు తదుపరి విడతల్లో శిక్షణ ఇస్తారు. అసెంబ్లీ కార్యకలాపాలను ఆధునీకరించడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించనుంది.