AP and Telangana Rains Live Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలెవ్వరు బయటకు రావద్దన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తునందున ప్రజలు ప్రయాణాలు చేయవద్దన్నారు. భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెo. 6309842395. 08717-293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109 ను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎందుకు ఆగిపోయాయో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.
వాయుగుండం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ 08942-240557 ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ పనుల్లో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. మత్స్యకార గ్రామాలు , లోతట్టు ప్రాంతాలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అప్రమత్తం చేశారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రౌట సంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొందగూడ గ్రామానికి చెందిన పశువుల కాపరి టేకం గణేష్ బండ్ల వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఉదయం పశువులను మేతకు తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో భారీ వర్షాలకు గ్రామ సమీపంలో బండ్ల వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో గణేష్ దాటుతున్న క్రమంలో ఒక్కసారి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో గణేష్ వాగులో కొట్టుకుపోయి కొద్ది దూరంలో అతన్ని మృతదేహాన్ని గ్రామస్థులు వెలికితీశారు.
హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. గంట నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హుజూర్ నగర్ మండలంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. హుజూర్ నగర్ మండలం లక్కవరంలో 248.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్న దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.
సిక్కోలు తీరానికి సమీపంలో వాయుగుండం చేరుకున్నట్లు తెలిసింది. కళింగపట్నంకు అతి చేరువలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. కళింగపట్నం కు 30కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిసింది.గంటకు 7కి.మీ వేగంతో నెమ్మదిగా కదులుతూ అర్ధరాత్రికి తీరం దాటుతుందని అంచనా. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
భారీ వర్షాలపై అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలోని వాయుగుండం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. రేపు చాలాచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఇకపై ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు హోంమంత్రి అనిత సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరతగతిన రెస్క్యూ ఆపరేషన్స్ జరగాలన్నారు. ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూ ఎస్, హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని హోంమంత్రి సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ , పడిన చెట్లు వెంటనే తొలగించాలన్నారు. ప్రజలు రోడ్ల మీద నీరు పూర్తిస్థాయిలో తగ్గేవరకు బయటకు రాకూడదని.. ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని హోంమంత్రి కోరారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని వెల్వడం వాగులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. నిన్నటి నుండి వర్షం కారణంగా పొలంలో వేసిన మినుము పంటను పరిశీలించడానికి తండ్రీ కొడుకులు వెళ్లారు. వెనక్కి తిరిగి వస్తుండగా వరద ఉధృతి పెరగడంతో వాగులో చిక్కుకుపోయారు. మైలవరం మండలం వెదురుబీడెం గ్రామానికి చెందిన కొణతం బ్రహ్మ కోటేశ్వరరావు, అతని తండ్రి రాజుగా వారిని గుర్తించారు. రాత్రి కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 3,26,481 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. 3,80,499 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండి నిండుకుండలా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం గేట్లన్నీ ఎత్తివేయడంతో ఆ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వెళ్తున్నారు.
నంద్యాల: భారీ వర్షాల దృష్ట్యా ప్రకటించిన 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇల్లు, హాస్టళ్లు, స్కూళ్లలో ఉండరాదని హెచ్చరించారు. కుందూ, మద్దిలేరు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో తెల్లవారుజాము నుంచి అతిభారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం దాటికి శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ, కొత్తపేటలో వర్షపు నీరు వాగులను తలపిస్తోంది. భారీ వర్షానికి స్థానికులు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రధాన రోడ్లు, రింగురోడ్డులో భారీగా వర్షపు నీరు చేరింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శ్రీశైలం మండలంలో తెల్లవారుజాము నుండి ఇప్పటివరకు 66.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైన మండలంగా శ్రీశైలం ఉంది.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో దుర్గ గుడి వద్ద పెద్ద చెరువుకు గండి పడింది. పెద్ద చెరువు నీటితో 50 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పది మంది స్థానికులు ఇళ్లల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణ, సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి , ఏలూరు జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ పడని వర్షం పడిందని మంత్రి పేర్కొన్నారు.
నీరు వచ్చే కాలువలను పూర్తిగా ఆక్రమణలు చేయడం వల్ల ఇటువంటి వరద రోడ్డుకు ప్రవహిస్తుందని మంత్రి పార్థసారధి వెల్లడించారు.పోలీసులు చాకచక్యంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. ఇబ్బందులు పడ్డారు కానీ ప్రాణ నష్టం ఏమి జరగలేదని ఆర్డీవో భవాని శంకరి చెప్పారు.
నూజివీడు పట్టణంలోని బైపాస్ రోడ్డులో కోళ్ల మేతతో వెళుతున్న లారీ వరద ఉధృతికి కాలువలోకి శనివారం కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు లారీ డ్రైవర్‌ను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. డ్రైవర్ పాపారావు మాట్లాడుతూ.. కోళ్ల మేతతో వస్తుండగా వరద ఉధృతికి లారీని లాక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత వెళ్ళనున్నారు.
సిక్కోలు తీరానికి సమీపంలో వాయుగుండం చేరుకున్నట్లు తెలిసింది. నెమ్మదిగా కదులుతూ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారు జామున కళింగపట్నంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం గంటకు 8కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 50కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది.
గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షానికి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ నీట మునిగింది. ఆర్ఆర్ నగర్‌లోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్‌లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. విద్యార్థినులు చదువుకునే, పడుకునే గదుల్లోకి కూడా వర్షపు నీరు చేరింది. వర్షపు నీటిలో విద్యార్థినుల పుస్తకాలు, బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు తడిచిపోయాయి. 120 మందికి పైగా విద్యార్థినులను అధికారులు పక్కనే ఉన్న మున్సిపల్ స్కూల్‌కు తరలించారు.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మాగనూర్ పెద్దవాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. మాగనూర్ మండలంలోని నేరడ్గం, అడవి సత్యారం, గ్రామాలకు వెళ్లే రహదారులపై గల కల్వర్టులపై నుండి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నస్రుల్లాబాద్ మండలం బొమ్మదేవిపల్లిలో కుండపోత వర్షం కురిసింది. గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షం కురిసింది. 13.సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిసింది. వర్ని మండలం జాకోరాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఎర్ర వంతెన వద్ద రైల్వే ట్రాక్‌పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండపల్లి ఫారెస్ట్ నుంచి భారీగా వరద పోటెత్తింది.
కాకినాడ జిల్లా తుని మండలం వీరవరపుపేటలో భారీ వర్షాలకు రామాలయం నేల కూలింది. 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన రామాలయం కూలిపోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు తుని పట్టణంలో పలు రోడ్లు జలమయమయ్యాయి.
రాష్ట్రంలో కుండపోత వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి. వీరులపాడులో అత్యధికంగా 21 సెం.మీ, కంచికచర్ల 20.3 సెం.మీ, ఇబ్రహీంపట్నంలో 15.3 సెం.మీ, నందిగామలో 13.8 సెం.మీ, విజయవాడలో 13.5 సెం.మీ, గంపలగూడెంలో 13.1సెం.మీ, చందర్లపాడులో 11 సెం.మీ, జగ్గయ్య పేట, విసన్నపేటలో 8.3సెంమీ వర్షపాతం కురిసింది. ఇవాళ, రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల్ చెరు - బాన్సువాడ రహదారిపై భారీ వర్షాలకు భారీ వృక్షం విరిగి రహదారిపై అడ్డంగా పడింది. ఈ క్రమంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాన్సువాడ - పిట్లం, బాన్సువాడ - బిచ్కుంద మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తుగా మెదక్ కలెక్టరేట్‌లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9391942254 నెంబర్‌ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ అధికారులు పనిచేయనున్నారు. జిల్లాలో అధికారులంతా అలెర్ట్‌గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడితో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. జిల్లా కేంద్రంలో భారీ వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మటన్, కూరగాయల మార్కెట్‌తో పాటు పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
బెజవాడలో వర్షం ఆగిపోయింది. తెల్లవారుజాము నుంచి కుంభవృష్టిగా కురిసిన వర్గంతో నగరం జలమయమైంది. అరగంట నుంచి వర్షం ఆగటంతో నగర వాసులు రోడ్డు మీదకు వస్తున్నారు.రోడ్లన్నీ వర్షపు నీటితో నిండి ఉండటంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఆస్పత్రి ప్రాంగణం జలమయమైంది. ప్రధాన ద్వారం దగ్గర వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఆస్పత్రిలోకి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రోగులు అవస్థలు పడుతున్నారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీచెరువు సమీపంలో గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రంగస్వామి ఆలయానికి దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు గుండ్లకమ్మ నది ఉధృతితో ఆలయం వద్ద నిలిచిపోయారు. వరద ఉధృతి తగ్గితేనే భక్తులు తమ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణా తో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోను భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్‌లను తెరవాలని తెలిపారు.
లోతట్టు, వరద ప్రాంతాల నుండి ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలని అన్నారు. ముఖ్యంగా ఉదృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్య పరచాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలలోని మంచి నీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవడంతోపాటు, అంటూ వ్యాధులు ప్రబల కుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్‌లను చేపట్టాలని తెలిపారు.
వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగు మందులను సిద్ధంగా ఉంచామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హైదరాబాద్, విజయవాడలలో ఉన్నాయని, ఏవిధమైన అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ ఎన్డీఆర్‌ఎఫ్ బృదాలను పంపించగలమని తెలియజేశారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వరదలు, వర్షాల వల్ల కొన్ని చోట్ల చెరువులకు స్థానికులు గండ్లు పెట్టే అవకాశం ఉందని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈవిధమైన చర్యలను పాల్పడకుండా నీటిపారుదల శాఖ అధికారులచే పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయితీ రాజ్ తదితర శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మాన్ హోల్‌లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు.
గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షం కారణంగా గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరి పొలాలు మనగడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే రెండుగంటల పాటు అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. 20 నుంచి 30 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి వద్ద జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు జంపలేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన స్థానిక అధికారులు, వాగు వద్దకు ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తెనాలిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలకు వీధులన్నీ జలమయమయ్యాయి. పట్టణ నలుమూలల్లో రోడ్లపై ఎటు చూసినా వర్షపు నీరే నిలిచి ఉంది. ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చొచ్చుకొని వచ్చింది. ఫైర్ స్టేషన్, వన్ టౌన్ పీఎస్, తహసీల్దార్ కార్యాలయ ఆవరణల్లో భారీగా వర్షపు నీరు చేరింది. భారీ వర్షాలతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. మరో రెండ్రోజులు వర్షాలు కొనసాగుతాయని అధికారులు అంటున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు.
భారీ వర్షాల వల్ల విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
రద్దైన రైళ్లు ఇవే..
1. ట్రైన్ నెంబర్ 07281 నర్సపూర్ - గుంటూరు(31.08.24)
2. ట్రైన్ నెంబర్ 07784 గుంటూరు - రేపల్లె(02.09.24)
3. ట్రైన్ నెంబర్ 07785 రేపల్లె - గుంటూరు(02.09.24)
4. ట్రైన్ నెంబర్ 07976 గుంటూరు - విజయవాడల(02.09.24)
5. ట్రిన్ నెంబర్ 17269 విజయవాడ - నాగపూర్(02.09.24)
రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఏలూరు జిల్లా నూజివీడు బస్టాండును వరద ముంచెత్తింది. ఆర్టీసీ బస్టాండ్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం దాటికి కర్నూలు నుంచి గుంటూరు వెళ్ళే ప్రధాన జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. భారీ వృక్షం నేలకొరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటన స్థలానికి చేరుకొని వృక్షాన్ని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని రాళ్ళచెరువుకు గండి పడింది. ఆయకట్టు కింద పంట పొలాలను వరద నీరు ముంచెత్తడంతో రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
విజయవాడలోని చిట్టీనగర్‌లో గల కలర్ హాస్పిటల్ దగ్గర రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎప్పుడూ లేనివిధంగా వర్షం నీరు, డ్రైనేజీ వాటర్ ఇంట్లోకి రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు ఇంజిన్‌లోకి వెళ్లి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. టూ వీలర్స్ మొత్తం పూర్తిగా మునిగిపోయాయి.
రోడ్లు నిండిపోవడం వల్ల కొంతమేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు-గోళ్లమూడి మధ్య ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాణ్విక్ మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. విజయవాడలో కొండ చరియలు విరిగిపడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ హైవే నీట మునిగింది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మోకాలు లోతు నీటిలో ట్రాఫిక్ అతి నెమ్మదిగా కదులుతోంది. హైవేపై వాహనాలు స్లో అవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఐదు రోజుల వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా అధికారులందరూ సమైక్యంగా పనిచేసి ఎటువంటి నష్టం కలగకుండా బాధ్యతలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్.. పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. నుంచి మూడు రోజుల పాటు భారీ.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సూర్య పేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో సిటీలో భారీ కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షపాతం ఉండటంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ల్లా కలెక్టర్స్‌తో పాటు ఆయా శాఖల అధికారులను ఐఎండీ అలెర్ట్ చేసింది.
విజయవాడలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరోసారి కొండచరియలు విరిగిపడగా.. సమీపంలోని ఇళ్లలో ఉన్నవారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
గుంటూరు డివిజన్‌లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.
తుళ్లూరు-118.2 మిమీ
తాడికొండ-104.2
ఫిరంగిపురం-70.6
మేడికొండూరు-64.6
గుంటూరు వెస్ట్-88.6
గుంటూరు ఈస్ట్-96.4
పెదకాకాని-88.6
వట్టిచెరుకూరు-63.8
ప్రత్తిపాడు-62.6
పెదనందిపాడు-39.4
మంగళగిరి కాజా టోల్‌ప్లాజా దగ్గర రోడ్డు నదిని తలపిస్తోంది. వరదనీరు రోడ్డుపైకి నదిలా రావడంతో ఆ వరదలో వాహనాలు చిక్కుకున్నాయి. టోల్‌ప్లాజా పరిసరాలకు రావొద్దంటూ పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. పల్లపు ప్రాంతం కావడంతో కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. కాజా టోల్‌గేట్‌లో సర్వర్లు మొరాయించాయి. టోల్‌గేట్‌ను ఎత్తివేసి అధికారులు వాహనాలను వదిలేశారు.
ఏపీలో వాయుగుండం ఎఫెక్ట్‌తో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచనలు చేశారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలని సూచించారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్ల జిల్లాలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి మాట్లాడారు.
ప్రకాశం జిల్లా కంభంలో ఓ మట్టిమిద్దె ముందు భాగం కూలింది. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో ఈ ఘటన చోటుచేసుకుంది. మట్టిమిద్దె కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆలపల్లి మండలాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని ఏడు మెలికల వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు.
భారీ వర్షం దెబ్బకు గుంటూరు జిల్లా వణికిపోతోంది. గ్రామాలు, పట్టణాలు, జాతీయ రహదారులు అన్న తేడా లేకుండా, వరదనీరు ముంచెత్తుతోంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం వరదలా మారి రోడ్లపైకి చేరింది. దీంతో అనేక వాహనాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. కాజా టోల్‌గేట్ సర్వర్లు కూడా మొరాయించాయి. దీంతో టోల్‌గేట్ గేట్లను ఎత్తివేశారు అధికారులు.