NTV Telugu Site icon

Terror Attack in Doda: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ పోస్ట్‌పై మరోసారి దాడి.. మూడు రోజుల్లో మూడోసారి..!

Jammu

Jammu

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు దిగుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రమూకలు దాడి చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు. అయితే, ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు గాయపడినట్లు తెలుస్తుంది. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో ఉగ్రదాడి జరిగింది. అలాగే, మూడు రోజుల క్రితం ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో డ్రైవర్ వారి నుంచి తప్పించడంతో ఆ బస్సు లోయలో పడిపోయింది. అప్పుడు జరిగిన ఆ దాడిలో 9 మంది ప్రయాణికులు చనిపోగా, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

Read Also: Road Accident : ఇసుక ట్రక్కు గుడిసెపై బోల్తా.. నలుగురు పిల్లలతో సహా 8మంది మృతి

అయితే, మంగళవారం సాయంత్రం కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు (IB) సమీపంలోని ఒక గ్రామంపై దాడి చేసి ఒక పౌరుడిని గాయపరిచిన దాగి ఉన్న ఉగ్రవాదులను బయటకు తీయడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టారు. కతువా ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది భద్రతా బలగాల చేతిలో హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. కథువా జిల్లాలోని చత్రగల ఏరియాలో నాలుగు రైఫిల్స్, పోలీసుల సంయుక్త పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మీడియాకు వెల్లడించారు.