NTV Telugu Site icon

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మరో కీలక నేత

సిద్దిపేట : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ‌ ఛైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత నిచ్చేలా చర్యలు‌ తీసుకుంటున్నారని.. మత్స్య కారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య కారుల‌ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని.. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వివరించారు.

మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన చేపలలో 60 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా మిగిలిన ఉత్పత్తిలో..21 శాతం పశ్చిమ బెంగాల్ కు , మిగిలిన 19 శాతం చేపలను అస్సాం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతోందన్నారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని… కానీ మత్స్యకారులు మద్యదళారులకు తక్కువ ధరలకు చేపలను విక్రయించుకొని నష్టపోతున్నారని తెలిపారు.

వారికి ఆర్ధికంగా లబ్ది చేకూర్చే ఉద్దేశంతో మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేరుగా మత్స్యకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని స్పష్టం చేశారు. 40 నుండి 50 క్లస్టర్ లకు ఒక ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుసంధానం చేయడం జరుగుతుందని.. మొదటగా హైదరాబాద్ లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లలో ఉన్న మత్స్య శాఖ కు చెందిన భూములలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.