ఈనెల 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక ప్రజలతోపాటు దేశం ఉలికిపడింది. సాయంత్రం వేళ అంతా ఇళ్లకు చేరుకునే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అయితే తాజాగా పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కార్లలో ఇరుక్కపోయిన జనం. ఓవైపు మంటలు.. మరోవైపు డెడ్‌బాడీలు.. బాధితులను కాపాడేందుకు పరుగులు పెట్టిన పోలీసులు.. ఘటనాస్థలిలో హాహాకారాలు.. ఆర్తనాదాలు భయానకంగా కనిపిస్తున్నాయి. కేంద్రం ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.
Also Read:HYDRA : సుద్దకుంట మార్కింగ్స్ తొలగింపు.. ప్రజలకు హైడ్రా కమిషనర్ ధీమా
పేలుడు కోసం రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు పేలుడుకి సంబంధించి 50 శాంపిల్స్‌ని సేకరించింది ఫోరెన్సిక్ సిబ్బంది. కారు మధ్యలో అమ్మోనియం నైట్రేట్ బాంబులు పెట్టినట్టు గుర్తించారు. కారు మధ్యలో అమ్మోనియం నైట్రేట్ బాంబులు పెట్టడంతో.. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఫోరెన్సిక్ సిబ్బంది తేల్చారు. కనిపించకుండా పోయిన 300కిలోల అమ్మోనియం నైట్రేట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. 300 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ని ఎక్కడ దాచారన్న దానిపై విచారణ కొనసాగుతోంది.