Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ

Anji Mamamaa

Anji Mamamaa

‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలంగాణ యాస, సహజ నటనతో అలరించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంజిమామ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకున్నారు. నటుడిగా మారకముందు ఆయన ప్లంబర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, ఆర్‌ఎంపీ డాక్టర్‌గా రకరకాల పనులు చేశారు. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ, ఏ రంగంలోనూ ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోయారు. త్వరగా నిలదొక్కుకుని మంచి జీవితం పొందాలనే ఉద్దేశంతో, స్నేహితులతో కలిసి ఒక ‘ఈజీమనీ’ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టారు.

అయితే ఆ నిర్ణయం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దాదాపు రూ.23 లక్షలు కోల్పోవడంతో ఆయన జీవితం మరింత కష్టాల్లోకి నెట్టిందని పేర్కొన్నాడు. తొందరపడి సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను ఎవరూ ఎంచుకోవద్దని, అలాంటి వాటిని ప్రోత్సహించవద్దని ఆయన తన అనుభవంతో హెచ్చరించారు. ప్రస్తుతం నటనలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే, హైదరాబాద్‌ నగరం వేదికగా క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నానన్నాడు.

కుటుంబ అవసరాల కోసం ప్రతి నెలా ఇంటికి రూ.50 వేలు పంపించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ పని చేయాల్సి వస్తోందని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించినప్పటికీ, కొందరు ప్రయాణికులు ఆయనను సులభంగా గుర్తుపడుతున్నారు. వరస కష్టాలు, ఆర్థిక భారాల మధ్య కొన్నిసార్లు హైదరాబాద్‌ను వదిలి సొంతూరికి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తోందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఒక ఎకరం పొలం, నాలుగు గేదెలు ఉంటే ప్రశాంతంగా.. హాయిగా బతికేయవచ్చని తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. తెరపై నవ్వులు పూయించే నటుడి వెనుక ఇంతటి ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసుకున్న ఆయన అభిమానులు నెట్టింట సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.