Anganwadi Workers: అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. మేం సమ్మె వాయిదా వేసే ప్రసక్తే లేదని అంగన్వాడీ సంఘాలు తేల్చి చెప్పాయి. అంగన్వాడీలను ప్రభుత్వం ఓ పక్క బుజ్జగిస్తూ.. మరోపక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికీ మా డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ల లేదని మంత్రి బొత్స చెప్పారన్నారు. మా సమస్యను ఇంకా సీఎం దృష్టికి తీసుకెళ్లక పోవడమేంటీ అంటూ వారు ప్రశ్నించారు. సీఎం దగ్గర వీళ్లు మంత్రులుగా ఉన్నారా.. లేదా..? అనే అనుమానం వస్తోందన్నారు.
Read Also: Breaking: అంగన్వాడీలతో చర్చలు విఫలం.. జీతాలు పెంపు సాధ్యం కాదన్న సర్కారు
సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేస్తే సమస్య పరిష్తరిస్తామని మంత్రి చెబుతున్నారని.. 15 రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఏమైనా బంగారపు గనులు వచ్చేస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీల జీతాలు పెంచడానికే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా అంటూ అంగన్వాడీ సంఘాలు మండిపడ్డాయి. అంగన్వాడీలు మానసిక వేదనకు గురవుతున్నారున్నారు. కొందరు అంగన్వాడీలు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. మా డిమాండ్ల సాధనకు రేపు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడిస్తాం.. వచ్చే నెల మూడో తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడతామన్నారు.
