Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!

Raw Mango Roti Pachadi

Raw Mango Roti Pachadi

Raw Mango Roti Pachadi: మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలామంది ఇళ్లలో ముందుగా గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడే. ముఖ్యంగా రోట్లో దంచిన మామిడికాయ రోటి పచ్చడికి ఉన్న రుచి మాటల్లో చెప్పలేం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. చాలా తక్కువ సమయంలో సింపుల్‌గా చేసుకునే ఈ రోటి పచ్చడి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మరి ఈ కమ్మటి మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
* పచ్చి మామిడికాయలు – 2
* మెంతులు – ¼ టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* ఆవాలు – 1 టీ స్పూన్
* కల్లుపుడి/ఉప్పు – తగినంత
* వెల్లుల్లి రెబ్బలు – 10
* కారం – 2 టేబుల్ స్పూన్లు
* పసుపు – ¼ టీ స్పూన్
* నూనె – టేబుల్ స్పూన్లు
* పచ్చిశనగపప్పు – ½ టీ స్పూన్
* మినప్పప్పు – ½ టీ స్పూన్
* ఇంగువ – ¼ టీ స్పూన్
* ఎండుమిర్చి – 4
* కరివేపాకు – కొద్దిగా

తయారీ విధానం:
మామిడికాయ ముక్కలు సిద్ధం:
ముందుగా మామిడికాయలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్క తీసేయకుండా కట్ చేస్తే పచ్చడికి మంచి టెక్స్చర్ వస్తుంది. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.

మసాలా దినుసులు వేయించడం:
స్టవ్‌పై కడాయి పెట్టి ముందుగా మెంతులను కొద్దిగా వేయించాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. ఇవన్నీ చల్లారాక రోట్లో లేదా మిక్సీలో వేసి ఉప్పుతో కలిసి మెత్తగా పొడిలా దంచుకోవాలి.

పచ్చడి దంచడం:
ఇప్పుడు రోట్లో వెల్లుల్లి రెబ్బలు, కొద్దికొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుంటూ దంచాలి. మధ్యలో కారం, పసుపు వేసి మరికొన్ని ముక్కలు జత చేస్తూ దంచుకుంటే పచ్చడి బాగా కలుస్తుంది. పచ్చడి మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న పలుకులు కనిపించేలా దంచితే రుచి మరింత బాగుంటుంది.

పోపు పెట్టడం:
కడాయిలో నూనె వేసి వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముద్ద, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ పోపులో ముందుగా దంచిన మామిడికాయ ముద్దను వేసి కలపాలి. అలాగే తయారుచేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా జత చేసి బాగా కలపాలి. చివరగా రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసి మరోసారి కలిపితే రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి రెడీ.

ఈ పచ్చడిని బయట ఉంచితే నాలుగు నుంచి ఐదు రోజుల వరకు బాగానే ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే వెంటనే తినాలనుకుంటే ఉల్లిపాయ కూడా వేసి దంచుకోవచ్చు. కాబట్టి ఈ మామిడికాయ సీజన్‌లో మీరు కూడా ఒకసారి ఈ పుల్లటి కమ్మటి రోటి పచ్చడిని ట్రై చేసి చూడండి. వేడి అన్నంలోకి ఇది నిజంగా అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది.