Andhra Pradesh Pension News: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని భావించిన ఈసీ.. ఆంక్షలు విధించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే బదులుగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. నేడు మొదటి రోజు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వచ్చారు.
ఉదయం నుంచి సచివాలయాల వద్ద పెన్షనర్స్ బారులు తీరారు. అయితే డబ్బు లేకపోవడంతో పెన్షన్ల పంపిణీ ఇంకా ఆరంభం కాలేదు. సచివాలయాల సిబ్బంది డబ్బు డ్రా చేయడం కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు నుంచి సచివాలయం వరకు డబ్బు తరలించే క్రమంలో ఇబ్బందులు లేకుండా ఆర్వోల వద్ద పర్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో పెన్షన్లు పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మండుటెండలో వృద్ధులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read: Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ.. హరిరామ జోగయ్య లేఖ!
సచివాలయాల వద్ద అధికారులు ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో పెన్షనర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో త్రాగునీరు లేక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ఇవాళ సాయంకాలం నుంచి ఫింఛన్ల పంపిణీ ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. దాంతో సచివాలయాల వద్ద నుంచి వెనుదిరిగిపోతున్నారు.