Site icon NTV Telugu

AP High Court: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. కోర్టు విధించిన షరతులు ఇవే..

Chandra

Chandra

AP High Court: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభిచింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది న్యాయస్థానం.. చంద్రబాబు అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. ఈ రోజు ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాల రీత్యానవంబర్‌ 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు అంటే 24వ తేదీ వరకు వాయిదా వేసింది.. ఇదే సమయంలో చంద్రబాబుకు కొన్ని షరతులు విధించింది న్యాయస్థానం.. ఇక, మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. మరోవైపు మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.. హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదాలు.. ఆ పిటిషన్‌ను విచారణకు అనుమతించింది హైకోర్టు.. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది.

హైకోర్టు చంద్రబాబు బెయిల్ కండీషన్ల విషయానికి వస్తే..
* షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్‌ ఇస్తూనే షరతులు విధించిన హైకోర్టు.
* ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు.
* కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు.
* ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి.. ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాలి.
* చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలు, ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..
* Z+ సెక్యూరిటీ విషయంలో.. కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, చంద్రబాబుకు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదన్న హైకోర్టు.

Exit mobile version