NTV Telugu Site icon

Pension Distribution: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. రూ.4,400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Ap Cs

Ap Cs

Pension Distribution: జులై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గత మూడు నెలల ముందే నుంచే పెంచిన పెన్షన్‌తో పాటు.. జులై నెల పెన్షన్‌ కూడా కలిపి ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.. దీని కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లతో ఈ రోజు వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ. 4,400 కోట్ల విడుదల చేసినట్టు వెల్లడించారు.. జులై 1వ తేదీన 65.18 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఫించన్లు పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు.. ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.. జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు.. పెన్షన్ల పంపిణీపై గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన డబ్బులను ఇవాళ రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సూచించారు సీఎస్.

Read Also: Mohan Babu: ‘కల్కి’ సినిమా అద్భుతం… మహాద్భుతం.. మా బావ ప్రభాస్‌ అంటూ మోహన్ బాబు రివ్యూ

కాగా, ఎన్నికల్లో పెన్షన్‌ను పెంచనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే.. దాని అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ ఫైల్‌పై సంతకం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పించన్ నాలుగు వేలకు పెంచింది కూటమి సర్కారు.. ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయగా.. ఆ ప్రకారం జులై నెలకు ఇచ్చే నాలుగు వేల ఫించన్ తోపాటు గడచిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలను కలిపి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సామాజిక ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే కావడం మరో విశేషం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇస్తున్న పెన్షన్‌ కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీకి సిద్ధం అయ్యింది.. రేపు ఆదివారం కావడంతో.. ఈరోజు నిధులు విడుదల చేసింది.. అంతేకాదు.. ఆ సొమ్మును డ్రా చేసుకుని సిద్ధంగా పెట్టుకోవాలని.. జులై 1వ తేదీన అంటే.. సోమవారం ఉదయం 6 గంటలకే పంపిణీ ప్రారంభం కావాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.