Andhra Pradesh: అంగన్వాడీల ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు.. విజయనగరం, పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు, మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధం అవుతున్నారు. అంతేకాకుండా.. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమించనున్నారు కలెక్టర్లు.
ఇక, పార్వతీపురం మన్యం జిల్లాలో విధులకు హాజరుకాని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచిచూశాం.. నేడు తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.. అంతేకాకుండా నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ విధులకు హాజరు కాని కార్యకర్తలు 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని.. జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, సాధికారిత అధికారి ఎం ఎన్ రాణి తెలిపారు. ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మరోవైపు.. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా అంగన్వాడీ కార్యకర్తలకు నేటి నుంచి విధుల నుంచి తొలగిస్తున్న ఉత్తర్వులు జారీ చేశారు.. విజయనగరం జిల్లా పరిధిలో 4151 అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాల్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొంటున్నారు.. నిబంధనల ప్రకారం వారికి నోటీసులు జారీ చేశాం.. అయితే, ఇవాళ్టి వరకు జిల్లాలో 503 మంది విధుల్లో చేశారు.. సోమవారం ఉదయం 9:30 గంటల వరకు కూడా తిరిగి విధులకు హాజరు కావడానికి అవకాశం కల్పించడం జరిగింది.. అలాంటి వారు మినహా ఇంకా విధుల్లో చేరని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి .
కాగా, సుదీర్ఘకాలంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, వీరిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది.. అయినా వారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.. ఈ రోజు ఆందోళనల్లో భాగంగా ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.. విజయవాడలో దీక్ష చేస్తున్నవారి దీక్షలు భగ్నం చేసిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.. ఇక, వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.
