Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు

Anitha

Anitha

Home Minister Anitha: బంగాళాఖాతంలోని వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం హైఅలెర్ట్ గా ఉండాలని సూచించారు. ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాను ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశ ఉందని తెలిపారు. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని.. బుధవారం బాపట్ల – విశాఖ తీరాల మధ్య తీరం దాటే సూచనలు ఉన్నట్లు చెప్పారు. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రమాదకర స్థితిలో ఉన్న హోర్డింగ్స్ వెంటనే తొలగించాలని ఆదేశించారు.

ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత తెలిపారు. “తీరప్రాంత ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని జిల్లా కంట్రోల్ రూమ్‌ల్లో పర్యవేక్షించాలి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. బీచ్ లోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆదేశం. భారీ అలలు ఎగసిపడే చోట సెల్ఫీలు దిగడం లాంటివి చేయరాదు. ప్రజలు, రైతులు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు, వాటిని వ్యాప్తి చేయవద్దు. విపత్తుల సంస్థ, ఆర్టీజీఎస్ అధికారిక హెచ్చరికలు పాటించాలి.” అని హోంమంత్రి వ్యాఖ్యానించారు.