Site icon NTV Telugu

New Gas Connections: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 10 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు..

CM Chandrababu

CM Chandrababu

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మరో భారీ ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో గ్యాస్ వినియోగదారులకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గృహ అవసరాల కోసం సిలిండర్ల బుకింగ్, డెలివరీ కోసం నిరీక్షించే అవసరం లేకుండా, నేరుగా పైపుల ద్వారా గ్యాస్ (PNG) సరఫరా చేసే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పైపులైన్ గ్యాస్ కనెక్షన్ల వెల్లువ..

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 10 లక్షల కొత్త కనెక్షన్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం వల్ల వినియోగదారులకు ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతాయి. సిలిండర్ అయిపోతుందనే ఆందోళన లేకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందుతుంది. దీనివల్ల వంట గదిలో భద్రత పెరగడమే కాకుండా, సిలిండర్ల రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి.

ఈ ప్రాజెక్టును వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. పైపులైన్ల ఏర్పాటు కోసం కావాల్సిన అనుమతులను కేవలం 24 గంటల్లోనే మంజూరు చేసేలా నూతన వ్యవస్థను తీసుకువచ్చారు. దీనివల్ల మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం ఉండదు.

మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుతం అమలవుతున్న ‘దీపం’ పథకం ప్రయోజనాలు ఈ పైపులైన్ గ్యాస్ వినియోగదారులకు కూడా వర్తిస్తాయి. ప్రభుత్వం అందించే రూ. 2,400 సబ్సిడీని నేరుగా వీరి ఖాతాల్లోకే లేదా బిల్లులో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా ఈ ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రానుంది. మొత్తానికి.. ఏపీ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన వినియోగ రంగంలో సరికొత్త మార్పుకు నాంది పలకనుంది.

Exit mobile version