Site icon NTV Telugu

Anderson–Tendulkar Trophy: రేపటి నుండే ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌.. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ..!

Anderson–tendulkar Trophy

Anderson–tendulkar Trophy

Anderson–Tendulkar Trophy: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ లకు ప్రతిష్టాత్మక గుర్తింపుగా “ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సంబంధించిన ట్రోఫీను తాజాగా ఆండర్సన్, టెండూల్కర్ లు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ 2007 నుంచి 2024 వరకు ఉన్న పటౌడి ట్రోఫీకి ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ కొత్త ట్రోఫీలో టెండూల్కర్‌కు చెందిన క్లాసిక్ కవర్ డ్రైవ్, అలాగే అండర్సన్‌కు చెందిన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉన్న చిత్రాలను పొందుపరిచారు. వీరిద్దరి సంతకాలు కూడా ట్రోఫీపై ఉండడం విశేషం.

Read Also: Metro Phase II: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIను మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

ఈ ట్రోఫీని బీసీసీఐ (BCCI), ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సంయుక్తంగా రూపొందించారు. ఇకపై భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న అన్ని టెస్ట్ సిరీస్‌ లకు ఇదే అధికారిక ట్రోఫీగా ఉంటుంది. ఇంతకు ముందు ఇంగ్లాండ్‌ లో జరిగే సిరీస్‌లకు పటౌడి ట్రోఫీ, భారత్‌లో జరిగే సిరీస్‌లకు ఆంథనీ డీ మెల్లో ట్రోఫీ ప్రదానం చేయడం జరిగేది. పటౌడి కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు కొత్తగా “పటౌడి మెడల్” ను రూపొందించారు. ప్రతి ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో విజేత జట్టు కెప్టెన్‌కు ఈ మెడల్ ప్రదానం చేయనున్నారు.
Read Also: Viral Video: పెళ్లిమండపం పైనే కాబోయేవాడికి ముద్దుల వర్షం కురిపించిన పెళ్లి కూతురు..!

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. పటౌడి వారసత్వం కొనసాగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని, ICC చైర్మన్ జై షా సహా పలువురు దీనికి తోడ్పాటునిచ్చారని తెలిపారు. టెస్ట్ క్రికెట్ అనేది జీవితాన్ని ప్రతిబింబించే ఆట. ఇది సహనం, క్రమశిక్షణ, స్థిరత్వం నేర్పుతుంది. టెస్ట్ క్రికెట్ వల్లే నేను ఎదిగాను. ఇప్పుడు అండర్సన్ లాంటి వ్యక్తితో ఇలాంటి గుర్తింపును పంచుకోవడం గర్వంగా ఉంది. ఈ ట్రోఫీ కొత్త తరం ఆటగాళ్లకు ప్రేరణగా నిలవాలని ఆయన అన్నారు.

మరోవైపు జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ.. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ పోటీకి నా పేరు చేర్చడం నిజంగా గౌరవంగా ఉంది. రెండు జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్తమంగా, అగ్రెస్సివ్ గా, చరిత్రతో నిండినదిగా ఉంటుంది. ఈ ట్రోఫీ ఈ గొప్ప పోటీకి మరో మైల్ స్టోన్ అవుతుందని అన్నారు. జేమ్స్ అండర్సన్ భారతదేశంపై 39 టెస్టుల్లో 149 వికెట్లు తీశారు. ఇందులో 6 ఫైవ్ వికెట్ హాల్ ఉన్నాయి. ఇక సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌పై 32 టెస్టుల్లో 2,535 పరుగులు చేశారు.

2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఈసారి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత యువజట్టు ఇంగ్లాండ్‌ను మొదట ఎదుర్కోనుంది. టీమ్‌లో విరాట్ కోహ్లీ, అశ్విన్, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు రిటైర్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కెప్టెన్ గిల్ పైన పడింది. బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను హోమ్ గ్రౌండ్‌లో ఆడుతోంది.

Exit mobile version