Geetha Bhagat : సినిమాల్లో నటించాలనుకునే వాళ్ళ కోసం తెలుగు యాంకర్ కీలక నిర్ణయం!

Geetha Bhagath

Geetha Bhagath

టాలీవుడ్ యాంకర్ గీతా భగత్ కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా, సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకునే యువత కోసం ఆమె సరికొత్త వేదికను సిద్ధం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఆరెంజ్ కాస్టింగ్’ పేరుతో ఒక కాస్టింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. సినిమా రంగంపై మక్కువ ఉన్న ఎంతోమంది యువతీ యువకులు సరైన దారి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఒక వారధిలా నిలవాలని గీతా భగత్ ఈ ఏజెన్సీని స్థాపించారు. దీనికి సంబంధించిన లోగోను ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎక్కడో మారుమూల ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని వెలుగులోకి తీసుకురావడం, సినిమాలు, వెబ్ సిరీస్, యాడ్స్ కి కొత్త ముఖాలకు సరైన అవకాశాలు కల్పించడం, కొత్త నటీనటులకు ఇండస్ట్రీకి మధ్య ఒక బాధ్యతాయుతమైన వేదికగా నిలవడం ఈ ఏజెన్సీ లక్ష్యం అని ఆమె చెబుతున్నారు.

“మంచి విషయాలను ప్రకటించడానికి కాస్త సమయం పట్టినా పర్వాలేదు” అంటూ గీతా భగత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “మా ప్రయాణం ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు అధికారికంగా మీ ముందుకు వస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మున్ముందు మరెన్నో అద్భుతమైన అప్‌డేట్స్ రాబోతున్నాయి” అంటూ ఆమె నెటిజన్లలో ఆసక్తిని పెంచారు. యాంకర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా భగత్అ వకాశాల కోసం వేచి చూస్తున్న వర్ధమాన నటీనటులకు ‘ఆరెంజ్ కాస్టింగ్’తో ముందుకు రావడంపై ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.